వేమన శతకము

0 comments

1) అన్నిదానములను నన్న దానమే గొప్ప
కన్నతల్లికంటె ఘనములేదు
ఎన్నగురునికన్న నెక్కుడు లేడయా
విశ్వదాభిరామ వినురవేమ.

అన్నింటికంటే ఘనమైనది అన్నదానము.ఎన్ని దానములు చేసిన అసంతృప్తితో ఉన్నవారు అన్నము దానము చేయుటతోనే సంతుష్టులు అవుతారు.కన్నతల్లి కంటే లోకములో ఉత్తమమైనది, ఉన్నతమైనది మరేమీ లేదు.జ్ఞానము ప్రసాదించు గురువు కంటే మించినవారు ఎవరూ లేరు.ఇవి నిత్య సత్యాలు.


2) కల్లలాడువాని గ్రామకర్త యెఱుగు
సత్య మాడువాని స్వామి యెఱుగు
బెద్దతిండిపోతుఁ బెండ్లామెఱుంగురా
విశ్వదాభిరామ వినురవేమ.

అసత్యము చెప్పే వాడిని గ్రామపెద్ద గ్రహించి అతనితో ప్రవర్తించవలసిన విధముగా వ్యవహరిస్తాడు.నిజము ఎవరు పలుకుతున్నారో సర్వాంతర్యామి అయిన భగవంతునికి తెలుసు.అందుకే భక్తులు కోరే కోర్కెలను భగవంతుడు తీర్చుతాడు.తిండిపోతు భర్తను భార్య గ్రహించును.అందుకే అతడికి సరిపడు ఆహారమును ఇస్తుంది.

3) ఎలుకతోలుఁదెచ్చి యేడాది వుతికిన
నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మ దెచ్చి కొట్టినఁబలుకునా
విశ్వదాభిరామ వినురవేమ.

ఎవరి స్వభావాలను మార్చుట ఎవరి తరము కాదు.అని తెలుపుట దీని భావములోని ఆంతర్యము.ఎలుకతోలు నల్లగా ఉంటుంది.దానిని ఒక ఏడాదిపాటు ఉతికినను అది తెల్లబడదు.చెక్క బొమ్మను ఎంతబాదిన దానికి ఎటువంటి ప్రభావము ఉండదు.

4) పాల నీడిగింటఁ గ్రోలుచునుండేనా
మనుజులెల్లఁగూడి మద్యమండ్రు
నిలువఁదగనిచోట నిలువ నిందలువచ్చు
విశ్వదాభిరామ వినురవేమ.

తాటి చెట్టు క్రింద నిలబడి పాలు తాగుతుదామంటే జనులు నమ్మెదరా,అలాగే కల్లు అమ్మేవాని ఇంట్లో ఉండి పాలు త్రాగిననూ దానిని జనులందరూ కల్లుగానే అనుకుందురు. నిన్ను అనుమానింతురు.అలాగే చెడ్డవాడితో కూడితే జనులు మనలను కూడా చెడ్డవానిగాను భావించెదరు.

5) పూజకన్న నెంచ బుద్దిప్రధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు,
విశ్వదాభిరామ వినురవేమ.

చేసే పూజ పునస్కారాలకన్నా బుద్ది మంచిదై ఉండవలెను, యిచ్చిన మాటకంటే ఆ మాటను నిలబెట్టు కోవటం ముఖ్యము. అలాగే ఏ కులంలో పుట్టిననూ ఆ కులం కంటే,గుణము మంచిదిగా ఉండవలెను.ఇదే ప్రధానము.

6) ఆత్మశుద్ది లేని యాచారమదియేల?
భాండశుద్ది లేని పాకమేల?
చిత్తశుద్ది లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.

మనసు నిర్మలతో లేనపుడు ఏపని చేసిన అది వ్యర్ధమే అగును.అపరిశుభ్రముగా వున్న పాత్రలో వంట చేసినచో అది శరీరమునకు మంచిదికాదుగదా.అదేవిధముగా నిశ్చలమైన మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఎలాంటి ఫలితాలనివ్వవు.

7) మృగమదంబుఁజూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైనవారి గుణములీలాగురా!
విశ్వదాభిరామ వినురవేమ.

కస్తూరి రంగు చూడటానికి నల్లగా ఉండును కానీ దాని సువాసన మాత్రం ఎంతో గొప్పగా పరిమళభరితమై ఉంటుంది. అదే విధంగా మంచివారి గుణములు కూడా.

8) రాముడొకడుపుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులముఁజెఱచె
ఇలను బుణ్యపాప మీలాగు కాదొకో
విశ్వదాభిరామ వినురవేమ.

శ్రీరామచంద్రుడంతటి ఉన్నత గుణములు కలిగినవాడు సూర్యవంశమునందు జన్మించుట వలన ఆ వంశము చరితార్థమైనది. నేటికీ విఖ్యాతి చెందినది.అలాగే దుర్యోధనుడు జన్మించుట వలన కురువంశము నామరూపాలు లేకుండా పోవడమే కాకుండా ఆ వంశానికి ఎన్నటికి చెరిగిపోని అపఖ్యాతి కూడా కలిగింది.ఇవే పాప పుణ్యముల ఫలితాలు.

9) కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు
విద్యచేత విఱ్ఱవీగువాడు
పసిడి గలుగువాని బానిసకొడుకులు!
విశ్వదాభిరామ వినురవేమ.

మంచి కులములో పుట్టినవాడు,వంద గౌరవము కలవాడు,చదువు వలన గర్వపడు వాడు వీరందురును ఐశ్వర్యము కలవానికి బానిడలుగానే బ్రతకవలయును.అనగా వారందురును ధనవంతుని ఆశ్రయించి ఉండవలసిన వారే. లేనిచో వారికి జీవనము లేదు.

10) కల్ల నిజములెల్ల గరళకంఠు డెరుగు
నీరు పల్లమెరుగు నిజముగాను
తల్లితానెరుగును తనయుని జన్మంబు
విశ్వదాభిరామ వినురవేమ.

ఏది అబద్దమో, ఏది నిజమో నల్లని కంఠము కలిగిన ఆ పరమేశ్వరునికి తెలుసు ఆయన సర్వము గ్రహించగలడు.పల్లము ఉన్న వైపుకే నీరు గ్రహించును.కుమారుని గురించి నవమోసాలు మోసి కనిన తల్లికి తప్ప అన్యులకు తెలియదు.

11) అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
దినగదినగ వేము తియ్యగనుండు
సాధనమునపనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ.

సాధన వలన ఏ కార్యము అయినా సాదించవచ్చు.మృదుమధురమయిన కంఠస్వరము ఎల్లవేళలా అలాగే ఉండాలంటే సాధన చేయటము ఒక్కటే మార్గము.అలాగే రోజూ తింటూ ఉంటే వేపాకులు కూడా కొన్ని రోజులకు తియ్యగా ఉన్నట్లు అనుభవంలోకి వస్తుంది.ఈ భూమి మీద ఏ పని అయినా సాధన చేయుట వలన సఫలం అవుతుంది.

12) కులములేనివాడు కలిమిచే వెలయును
కలిమి లేనివాడు కులము దిగును
కులముకన్న భువిని గలిమి యెక్కువ సుమీ
విశ్వదాభిరామ వినురవేమ.

కులం తక్కువ వాడు ధనము సంపాదించి గొప్పవాడగును.ఉత్తమ కులంలో పుట్టిన వాడైనను ధనము లేనిచో వాని కులము అథమస్థానమును పొందును.కావున లోకములో కులముకంటే ధనమే ప్రధానము.అది ఉన్నవానికి అన్ని ఉన్నట్లే.

13) దాతకానివాని దరచుగా వేడిన
వాడు దాత యౌనె వసుధలోన
అవురు దర్భయౌనె యబ్ధిలోముంచిన
విశ్వధాభిరామ వినురవేమ.

దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా?వాడు దాత అవుతాడా?ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా?

14) ఆత్మయందె దృష్టి ననువగా నొనరించి
నిశ్చలముగ దృష్టి నిలిపెనేని
అతడునీవె సుమ్మి యనుమానమేలరా
విశ్వధాభిరామ వినురవేమ!

గురువు యొక్క ఉపదేశమువల్లనే మనస్సునందు ఆత్మను నిశ్చల ఏకాగ్రతతో వీక్షించిన మోక్షమును లభించగలదు.ఇది గురువు యొక్క సేవ వలనే లభించును.

15) వంపుకఱ్ఱ గాల్చి వంపు దీర్చగవచ్చు
గొండలన్ని పిండి గొట్టవచ్చు
గఠినచిత్తు మనసు కరిగింపరాదు
విశ్వదాభిరామ వినురవేమ.

వంపులు ఉన్న కర్రను తీసుకొని దాని యొక్క వంపులను పోగొట్టవచ్చును.కొండలను పిండిగా చేయవచ్చును.కాని కఠినాత్ముని మాత్రం మార్చలేము.

16) నీటిలోని వ్రాత నిలువక యున్నట్లు
పాటిజగతిలేదు పరములేదు
మాటిమాటికెల్ల మారును మూర్ఖుండు
విశ్వదాభిరామ వినురవేమ.

నీటిమీద వ్రాసిన వ్రాత ఎందుకునూ కొరగాదు.ఉపయోగము లేనిది.అలాగే మూర్ఖుని స్వభావము మాటి మాటికి మారుతూ ఉండును.అనగా మంచి,చెడ్డలు ఆలోచింపరని భావము.

17) చంపగూడదెట్టి జంతువైనను
 చంపవలయు లోక శత్రుగుణము
తేలుకొండిఁగొట్టఁదే లేమి చేయురా
విశ్వదాభిరామ వినురవేమ.

చెడును నాశనము చెయ్యాలంటే దానిని అంతమొందించటం ఒకటే మార్గము కాదు.తేలు క్రూర జంతువని దానిని నాశనము చేయకుండా దాని కొండినితీసివేస్తే దాని వలన ఎటువంటి ప్రమాదము వుండదు.అలాగే లోకములో ఉన్న హింసాప్రవృత్తిని చంపవలెను.అందుకు మన చెడుబుద్దిని విడువవలెను.

18) అరయ నాస్తియనక యడ్డుమాటాడక
తట్టుపడక మదిని దన్నుకొనక
తనది గాదనుకొని తాబెట్టునదె పెట్టు
విశ్వదాభిరామ వినురవేమ.

యాచకుడు తనను అడగవచ్చినప్పుడు లేదనకుండా,తొట్రుపాటు లేకుండా,ఇవ్వనా?వద్దా అని మనసులో అలోచించక ఇచ్చే వస్తువు మీద మమకారము విడిచి దానము చేసినచో ఆ దానము కోటిరెట్లు ఫలమునిచ్చును.

19) చిప్పబడ్డ స్వాతిచినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటగలిసె
బ్రాప్తికలుగుచోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ.

స్వాతికార్తెలో కురిసేటువంటి వాన చినుకు చిప్పలో పడినచో ముత్యము అగును. అదే నీటిలో పడినచో నీటిలో కలిసిపోవును.ఆ విధంగానే మనకు రాజాశ్రయము దొరికిన మన బ్రతుకు ముత్యమువలె మెరిసిపోవును.లేకపోతే మనము కూడా నీటిలో కలిసిపోయిన వాన చినుకు వలె అయిపోతాము.

20) పట్టుపట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియఁ బిట్టవలెను
పట్టిడుడచుకన్న బడి చచ్చుటయెమేలు
విశ్వదాభిరామ వినురవేమ.

ప్రతీ విషయములోను నా మాటే నెగ్గాలని పట్టుదల మంచిది కాదు.ఒకవేళ పట్టుపట్టిన ఆ పని లేదా మాట నెరవేరేవరకు విడువరాదు.అలాచేసే కంటే ఆత్మహత్య ఎంతో నయము అని తెలుసు కొండి.

21) అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను
కలనుం గాంచులక్ష్మి కల్లయగును
ఇలను భోగభాగ్య మీతీరు కాదొకో
విశ్వదాభిరామ వినురవేమ.

తీరమును ఢీకొన్న కెరటముల వలన ఏర్పడిన నీటి బుడగలు ఎంత సేపు వుండును?తిరిగి మరొక కొత్త కెరటము రాగానే నశించును.అలాగే నిదురలో చూచిన ఏదైననూ కనులు తెరవగానే కనబడదు(ధనమును చూచినను).అలాగే కంటికి కన్పించే భోగములు,భాగ్యములు శాశ్వతములు కావు.వాటిని పట్టుకు వ్రేలాడువాడు అజ్ఞానిగానే మరణించును.

22) పెట్టిపోయలేని వట్టినరులు భూమి
బుట్టనేమి వారు గిట్టెనేమి
పుట్టలోనఁజెదలు పుట్టవా?గిట్టవా?
విశ్వదాభిరామ వినురవేమ.

దానము అంటే ఎరుగని మనిషి,ఆకలి అన్నవానికి అన్నం పెట్టనివారు,దాహమైన వాడికి మంచినీరైనా ఇవ్వని వారు పుట్టినందు వలన ఉపయోగమేముంటుంది?మరణించి నందు వలన నష్టము ఏముంది?కుప్పలు తెప్పలుగా చెద పురుగులు పుట్టుట లేదా, మరణించుట లేదా? దీనివలన ఎవరికి ఎటువంటి ప్రయోజనము?

23) హీన గుణమువాని నిలుసేఱ నిచ్చిన
ఎంతవానికైన నిడుము గలుగు
ఈగ కడుపుఁజొచ్చి యిట్టట్టు సేయదా?
విశ్వదాభిరామ వినురవేమ.

కడుపులో ప్రవేశించిన ఈగ ఎంత గందరగోళము చేసి బాధపెట్టునో, ఆ విధంగానే నీచమైన గుణములు కలిగినవారికి ఒక్కరికైననూ ఇంటిలో ఆశ్రయమిచ్చినచో,ఆ ఇంటి యజమానికి అనేక కష్టములు కలుగును.

24) మేడిపండుచూడ మేలిమై యుండు
పొట్టవిప్పిచూడఁబురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ.

నిగనిగలాడుతూ కనిపించే మేడిపండుబయటికి చూచుటకూ చాలా చక్కగా కనిపించును. కాని దాని పొట్టవిప్పి చూస్తే లోపల పురుగులుండును. ఆ విధముగానే పై పై బీకరములు చూపు వాని మదిలో పిరికి తనము సందర్భము వచినప్పుడు బయల్పడును.

25) చిత్త శుద్ది కలిగి పుణ్యంబు
కొంచమైననదియుఁకొదువకాదు
విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ.

మఱ్ఱి వృక్షము చూసినా ఎంత విస్తరముగా ఉండును.కాని దాని విత్తనమును చూస్తే ఎంతో చిన్నది. అలాగే మంచి మనసు తో చేసిన పుణ్యము బహుచిన్నదిగా తక్కువదిగా తలపోయరాదు. సద్బుద్ధితో చేసినది చిన్నదైనా,పెద్దదైనా ఉన్నత ఫలితమునే కలిగించును.